రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న వేసిన కవిత…
- రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందన్న రేవంత్ రెడ్డి
- 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సమస్య ఏమిటని ప్రశ్నించిన కవిత
- తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? అంటూ రాహుల్ కు ప్రశ్న
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగును పులుముకున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ… రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకైనా వచ్చిన సమస్య ఏమిటని ఆమె ప్రశ్నించారు. వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ను రైతులకు ఇవ్వలేకపోతున్నారని… అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న వేశారు. రైతుల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాపాడుతుందని చెప్పారు. ప్రతి ఒక్క రైతుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.