- ఇండియన్ క్రీక్ ఐల్యాండ్ లో కొనుగోలు
- నెల క్రితం రూ.20 కోట్లతో డైమండ్ రింగ్ బహుమానం
- కాబోయే భార్య సంతోషం కోసం తెగ ఖర్చు చేస్తున్న బెజోస్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కు ఖరీదైన కానుకలను ఇచ్చి సంతోష పెట్టే కార్యక్రమంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న బెజోస్ 68 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.560 కోట్లు) ఫ్లోరిడాలోనే ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ క్రీక్’లో ఇల్లు కొనుగోలు చేశారు. మూడు పడక గదుల ఇల్లును సమకూర్చారు. ఇండియన్ క్రీక్ అనేది కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవి.
ఇది ప్రియురాలికి బెజోస్ ఇచ్చిన రెండో కానుక. నెల క్రితమే 2.5 మిలియన్ డాలర్లతో (రూ.20 కోట్లు) డైమండ్ రింగ్ ను బహూకరించడం తెలిసిందే. బ్లూంబర్గ్ సంస్థ అంచనా ప్రకారం బెజోస్ నెట్ వర్త్ 163 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రియురాలి కోసం కొనుగోలు చేసిన ఇల్లు 2.8 ఎకరాల భూభాగంలో, 9,259 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఉంది. దీన్ని 1965లో నిర్మించారు. క్రీక్ ఐల్యాండ్ అని పిలిచే ఇది చిన్న దీవి. ఇక్కడి జనాభా కేవలం 81 మంది అని 2021 జనాభా లెక్కల ఆధారంగా తెలుస్తోంది. మున్సిపాలిటీ, మేయర్, పోలీసు ఇలా వేర్వేరు విభాగాలు సైతం ఉన్నాయి.