కొంపదీసి యుద్ధ ట్యాంకుల్ని కూడా మమ్మల్నే కొనుక్కోమనరుగా: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
- టీకాల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదు
- కేంద్రం తీరు దారుణంగా ఉంది
- వ్యాక్సిన్‌ను తొలుత తయారు చేసినప్పటికీ ఆరు నెలల ఆలస్యంగా వ్యాక్సినేషన్
వ్యాక్సిన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. టీకాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛనివ్వడం లేదన్న ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడమే కాకుండా రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం దేశం మొత్తం కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతోందన్న ఆయన.. ఒకవేళ పాకిస్థాన్ కనుక భారత్‌పై దాడిచేస్తే రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రం తీరు చూస్తుంటే యుద్ధ ట్యాంకులను కూడా మీరే కొనుక్కోవాలని చెప్పేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తొలుత భారత్‌లోనే తయారైనా ఆరు నెలల ఆలస్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని విమర్శించారు. అప్పటి నుంచే టీకా ఉత్పత్తి పెంచితే సెకండ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ఉండేవాళ్లమని, ఆ ఆలోచన లేకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని కేజ్రీవాల్ అన్నారు.