కడపలో రెచ్చిపోయిన ఎస్సై… యువకుడిని లాఠీతో చితకబాదిన వైనం!
ఈ నెల 25న ఘటన: సోషల్ మీడియా తో వైరల్
కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని ఎస్సై
ఎస్సై వేటు … వీఆర్‌కు బదిలీ చేసిన ఎస్పీ
లాక్‌డౌన్ ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిపై ఎస్సై చెలరేగిపోయాడు. విచక్షణ రహితంగా చితకబాదాడు. కడపలో ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై తీరుపై విమర్శలు రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు బదిలీ చేశారు.
కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఈ నెల 25న ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా కడప టూటౌన్ ఎస్సై జీవన్‌రెడ్డి కనిపించాడు. దీంతో భయపడిన యువకుడు వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై లాఠీతో ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. దగ్గరలో అది గమనిస్తున్నవారు దాన్ని తమ సెల్ ఫోన్ లో బంధించారు. దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరాలగా మారింది.ఈ సంఘటన ఉన్నతాధికారుల దృష్టికి పోయింది . దానిపై ఎస్ ఐ పై చర్యలు తీసుకోకతప్పలేదు
యువకుడు ఎస్సై కాళ్లు పట్టుకుని విడిచిపెట్టాలని వేడుకున్నప్పటికీ వదలకపోగా మరింతగా రెచ్చిపోయాడు. యువకుడిని ఎస్సై చావబాదుతున్న వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ అన్బురాజన్ విచారణ జరిపించి ఎస్సై జీవన్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేశారు.