- 2024 ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని వెల్లడి
- 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుందని వెల్లడి
- మహిళా సాధికారత కొన్ని పార్టీలకు రాజకీయ అజెండా అని ఆగ్రహం
- బీజేపీకి మహిళా సాధికారత రాజకీయ అజెండా కాదని స్పష్టీకరణ
రానున్న లోక్ సభ ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ వర్తించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నిన్న లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు చర్చ సాగింది. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు అన్నారు. అరవై మంది సభ్యులు ఈ బిల్లుపై మాట్లాడారు. చివరలో అమిత్ షా బిల్లుపై సమాధానం ఇచ్చారు.
2024 ఎన్నికలు జరగగానే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును నాలుగుసార్లు సభలో ప్రవేశపెట్టామని, ఈసారి ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కేంద్ర హోంశాఖ మంత్రి కోరారు. కొన్ని పార్టీలు మహిళా సాధికారతను రాజకీయ అజెండాగా తీసుకొని, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ తమ పార్టీకి, తమ పార్టీ అధినేత నరేంద్రమోదీకి మహిళా సాధికారత రాజకీయ అజెండా కాదన్నారు.
కాంగ్రెస్ యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, గరీభీ హఠావో నినాదానికే పరిమితమైందన్నారు. బహిరంగ టాయిలెట్స్ వల్ల మన కూతుళ్లు, సోదరీమణులు, తల్లులు ఇబ్బందిపడ్డారన్నారు. మోదీ ప్రభుత్వం వారి సమస్యను అర్థం చేసుకుందన్నారు.