Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య కరోనా వ్యాక్సినేషన్ యుద్ధం!

రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య కరోనా వ్యాక్సినేషన్ యుద్ధం!
దేశంలో సరైన వ్యాక్సిన్ ప్రణాళిక లేదన్న రాహుల్
దేశంలో మరిన్ని కరోనా వేవ్ లు వస్తాయని హెచ్చరిక
కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఉద్ఘాటన
రాహుల్ కు కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ జవదేకర్

దేశంలో కరోనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీపై విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు. సరైన ప్రణాళిక లేకుండా కేంద్రం వ్యవహరించటం వల్లనే దేశంలో ఎక్కువకేసులు ఎక్కువమరణాలు సంభవించాయని రాహుల్ చేసిన ఆరోపణలపై బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
దేశంలో తప్పుడు వ్యాక్సినేషన్ విధానంతో కరోనా వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయడంలో మోదీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం సరైన వ్యాక్సినేషన్ ప్రణాళిక పాటించకపోతే దేశం మరిన్ని కరోనా వేవ్ లకు గురికాక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్లు, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వల్ల కరోనాతో పోరాడవచ్చని, కానీ ఇవన్నీ తాత్కాలిక వ్యూహాలేనని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని కరోనా బారినుంచి రక్షించాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడమొక్కటే మార్గమని ఉద్ఘాటించారు. వ్యాక్సినేషన్ ఆలస్యం అయ్యే కొద్దీ కరోనా వైరస్ జన్యు రూపాంతరం చెందుతూ, మరింత విస్తృతమవుతుందని, అప్పుడు మూడు, నాలుగో వేవ్ లు కూడా వస్తాయని వివరించారు. ఈ ప్రభుత్వం దేనిపై పోరాడుతోందో కూడా అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. కేవలం 3 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చి 97 శాతం మందిని వైరస్ కు బలి చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గట్టిగా బదులిచ్చారు. కరోనాపై ఇప్పటికే ప్రజల్లో భయాందోళనలు ఉంటే, రాహుల్ వాటికి మరింత ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. రాహుల్ విమర్శలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద టూల్ కిట్ రూపొందించినట్టు నిర్ధారణ అవుతోందని జవదేకర్ అన్నారు.

“నాటకాలు ఆడుతున్నారంటూ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు, వారు వాడుతున్న భాష చూస్తే, టూల్ కిట్ సృష్టికర్తలు మీరేనని అర్థమవుతోంది. అందుకు పెద్దగా ఆధారాలు కూడా అక్కర్లేదు. రాజకీయాల్లో భాగంగానే కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు” అంటూ ఆరోపించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబరు కల్లా 216 కోట్ల డోసుల ఉత్పత్తికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వద్ద ప్రణాళిక ఉందని, 108 కోట్ల మంది వ్యాక్సిన్ పొందుతారని వివరించారు. ఇప్పటికే భారత్ లో 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని, వ్యాక్సినేషన్ లో మనదేశం రెండోస్థానంలో ఉందని జవదేకర్ వెల్లడించారు. ఆగస్టు నుంచి భారత్ లో వ్యాక్సినేషన్ మరింత వేగం పుంజుకుంటుందని తెలిపారు.

తమను విమర్శించే బదులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల నిర్వాకాన్ని గమనిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి తమ రాష్ట్రాలకు రావాల్సిన డోసులను కూడా సాధించుకోలేకపోతున్నాయని జవదేకర్ ఎద్దేవా చేశారు. అంతేగాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ సమర్థతపై రాహుల్ సందేహాలు లేవనెత్తడం సరికాదని అన్నారు.

Related posts

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తో బంధం తెంచుకోబోతున్నారా ?

Drukpadam

చట్ట సభలలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం….

Drukpadam

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు …

Drukpadam

Leave a Comment