- మొన్న ఎక్స్ ప్రెస్.. నిన్న స్లీపర్.. నేడు నాన్ ఏసీ ట్రైన్
- వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్న రైల్వే
- సంప్రదాయ రైళ్లకంటే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం
- సాధారణ ప్రయాణికులకు మేలు కలుగుతుందన్న అధికారులు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ తో భారత రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఈ అత్యాధునిక రైళ్లను తీసుకొచ్చింది. ఇప్పుడున్న రైళ్లకన్నా మరింత వేగంగా, మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వందేభారత్ ట్రైన్ ఉపకరిస్తుందని పేర్కొంది. తొలుత వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. రాత్రిపూట ప్రయాణాల కోసం ఇటీవలే స్లీపర్ కోచ్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఈ ట్రైన్ల టికెట్ ధరలను చూసి పేద ప్రయాణికులు అటువైపు కూడా చూసే సాహసం చేయరు. ఈ నేపథ్యంలో అల్పాదాయ వర్గాల కోసం వందే సాధారణ్ ట్రైన్లను (నాన్ ఏసీ) తీసుకురానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అనధికారిక సమాచారం ప్రకారం.. ఈ వందే సాధారణ్ ట్రైన్లు వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. నాన్ ఏసీ కోచ్ ల తయారీని వేగవంతం చేసినట్లు చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.
వందే సాధారణ్ ట్రైన్ ప్రత్యేకతలు..
- ఒక్కో ట్రైన్ కు 24 కోచ్ లు (గరిష్ఠంగా)
- వెనకా ముందు (పుష్ పుల్) ఇంజన్లు
- సాధారణ రైళ్లతో పోలిస్తే మెరుగైన సీట్లు, ప్రతీ బెర్త్ వద్దా చార్జింగ్ పాయింట్లు
- మిగతా వందేభారత్ రైళ్లలో మాదిరిగానే కోచ్ లో అనౌన్స్ మెంట్ స్కీన్లు, ఆడియో వ్యవస్థ
- బయో వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు
- ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు