- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- బాబు తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్
- అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజురు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారించింది. చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు.
ఈ క్రమంలో రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, అరెస్టులపై ఎలాంటి ఆదేశాలను ఇవ్వొద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ… పీటీ వారెంట్ లేనప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఒకవేళ పీటీ వారెంట్ వేస్తే ఇబ్బంది అవుతుందని చంద్రబాబు తరపు న్యాయవాది చెప్పారు.
మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసును హైకోర్టు రేపు విచారించనుంది. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది.