- తెలంగాణకు రావాల్సిన నిధులను బీజేపీ ఆపేసి, అభివృద్ధిని అడ్డుకుందన్న హరీశ్ రావు
- బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని ఎద్దేవా
- అసెంబ్లీకి పోటీ చేయబోమని కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పుకుంటున్నారన్న మంత్రి
- ఇతర రాష్ట్రాలది తెలంగాణ పథకాలను మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితన్న హరీశ్ రావు
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల్ని బీజేపీ ఆపేసి, అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణకు ఆ పార్టీ చేసిన ఒక రూపాయి అభివృద్ధి చూపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు అసెంబ్లీకి పోటీ చేయం… ఎంపీగా పోటీ చేస్తామంటూ తప్పించుకుంటున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని, అలాంటిది ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్రం ఒక అవార్డు ఇవ్వని పరిస్థితి ఉందని, తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన ప్రధాని మోదీ రాజకీయం కోసం గల్లీలో మాత్రం తిడుతున్నారన్నారు. సాక్షాత్తు మోదీనే పార్లమెంటులో… కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన నీళ్ల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతారని చెప్పారన్నారు.
తెలంగాణ పథకాలను తమ మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో నెలకొందన్నారు. తెలంగాణ ఆచరిస్తది… దేశం అనుసరిస్తది అన్న విధంగా మారిందన్నారు. సీట్లు కావాలంటే ఢిల్లీకే పోవాలి… పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి… ఆఖరికి ఓట్లు కావాలంటే కూడా ఢిల్లీ నుంచి నాయకులు రావాల్సిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలది అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రాజ్‌నాథ్ సింగ్ నవ్వుల పాలవడంతప్ప మరేం లేదన్నారు. తెలంగాణ ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచడమే కేసీఆర్‌కు తెలుసునన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ రోజుకు ఒక స్కామ్‌తో కుదేలవుతోందని విమర్శించారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతోందని, కానీ 11 సార్లు అధికారామిచ్చినా ఏం చేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని అన్నారు.