- గత కొన్నిరోజులుగా ముఖేశ్ అంబానీకి బెదిరింపులు
- రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ వార్నింగ్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబానీ భద్రతా సిబ్బంది
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపులపై ముఖేశ్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ బెదిరింపు మెయిళ్ల వెనుక ఉన్నది తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థి పేరు వనపర్తి గణేశ్. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గణేశ్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ముంబయికి తరలించారు. కోర్టులో హాజరుపర్చగా, నవంబరు 8 వరకు కస్టడీ విధించారు.
దీనిపై పోలీసులు స్పందిస్తూ… గణేశ్ ఓ విద్యార్థి అని, ఈ బెదిరింపుల వెనుక అతడి ఉద్దేశం ఏమిటన్నదానిపై ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. అక్టోబరు 27 నుంచి నవంబరు 1 మధ్యన అనేక బెదిరింపు ఈ-మెయిళ్లు పంపాడని తెలిపారు.
గణేశ్ బెదిరింపు మెయిళ్లు పంపడానికి వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) పరిజ్ఞానాన్ని వినియోగించాడని, మొదట ఆ మెయిళ్లు బెల్జియం నుంచి వచ్చినట్టుగా భావించామని, లోతుగా పరిశోధిస్తే ఆ మెయిళ్లు పంపింది తెలంగాణ విద్యార్థి అని గుర్తించామని పోలీసులు వివరించారు. తొలుత రూ.20 కోట్లు డిమాండ్ చేసిన గణేశ్ చివరికి రూ.400 కోట్లకు పెంచాడని తెలిపారు….