- మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందని వ్యాఖ్య
- గెలిచి ప్రజల కష్టాలను, తన కష్టాలను అసెంబ్లీలో వినిపిస్తానని చెబుతోందన్న లక్ష్మీనారాయణ
- బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి
బర్రెలక్క కర్నె శిరీష ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ముందుకు సాగుతోందని.. ఆమె కూడా మనందరికీ ఆదర్శమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందన్నారు. వీజే డిగ్రీ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వస్తే తాను ప్రోత్సహిస్తుంటానని, కొల్లాపూర్ నుంచి బర్రెలక్క కర్నె శిరీషకు కూడా తాను మద్దతు తెలుపుతున్నానని…
ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. తాను గెలిచి.. తన కష్టాలను, ప్రజాసమస్యలను కచ్చితంగా అసెంబ్లీలో వినిపిస్తానని ఆమె చెబుతోందని, అలాంటప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
శిరీషను తాను నిన్న కలిసి ధైర్యాన్ని… భరోసాను ఇచ్చి ప్రోత్సహించానన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని… నాయకులు.. పార్టీలు అవే ఉంటుంటే కొత్తవారు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. కాబట్టి యువతరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడు చెబుతుంటానని, అలా వచ్చే వారిని ప్రోత్సహిస్తానన్నారు. యువతం నిర్ణయించుకుంటే భారత భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. అందుకే యువతరానికి తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పారు. తానూ పోటీ చేస్తానన్నారు.