పాకిస్థాన్ మత్స్యకారుల వలలో అరుదైన చేప ‘క్రోకర్ ఫిష్’ ధర రూ.8.64 లక్షలు
-గ్వాదర్ సమీపంలో చేపల వేట
-ఓ మత్స్యకారుడి వలలో 48 కిలోల చేప
-అరుదైన చేపగా గుర్తింపు
-వేలంలో కళ్లు చెదిరే ధర
-పాక్ కరెన్సీలో రూ.8.64 లక్షలకు అమ్ముడైన వైనం
మత్స్యకారుల వలకు అప్పుడప్పుడు ఎంతో అరుదైన చేపలు పడుతుంటాయి. ఆ చేపలకున్న విశిష్టతల వల్ల వాటికి లక్షల్లో ధర పలుకుతుంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు కూడా ఇలాంటి చేప కారణంగా రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు. జివానీలో నివసించే సదరు మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతడి వలలో ఎంతో అరుదైన క్రోకర్ ఫిష్ పడింది. ఈ చేపను సోవా లేక కిరి (స్థానికంగా) అంటారు. ఈ చేప 48 కిలోల బరువు తూగింది. దీన్ని వేలం వేయగా కళ్లు చెదిరే రీతిలో రూ.8.64 లక్షలు (పాకిస్థానీ కరెన్సీ) ధర పలికింది.
ఈ చేపలోని ఓ భాగాన్ని ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు. శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల తయారీకి దీన్ని వినియోగిస్తారు. అందుకే ఈ క్రోకర్ ఫిష్ కు అంత డిమాండ్! ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్ లో దీనికి అత్యధిక ధర పలుకుతుంది. ఇటీవలే జివానిలో ఇలాంటిదే ఓ చేప లభ్యం కాగా, అది రూ.7.80 లక్షలు (పాకిస్థానీ కరెన్సీ) పలికినట్టు వెల్లడైంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ కు మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు ఎక్కువగా లభ్యమవుతాయి.