చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ కలిస్తే మాకేంటి సంబంధం?: జీవీఎల్
- చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై జీవీఎల్ స్పందన
- ఆ భేటీ గురించి టీడీపీ చెబితేనే బాగుంటుందని వెల్లడి
- ఈ సమావేశంపై బీజేపీ స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అనదగ్గ చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ కలిస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.
“ప్రశాంత్ కిశోర్ తో సమావేశం గురించి చంద్రబాబు అయినా చెప్పాలి, లేకపోతే, ఈ భేటీలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ అయినా చెప్పాలి. ఈ భేటీపై బీజేపీ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టుగా టీవీలో చూశాను. ఇది మేం పరిశీలనలోకి తీసుకోదగ్గ అంశం కాదు.
రాజకీయాల్లో అనేకమంది ఒకరినొకరు కలుస్తుంటారు. చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ ఎందుకు కలిశారన్నది టీడీపీ వాళ్లు చెబితేనే బాగుంటుంది. దీనిపై మేం స్పందించాల్సిన పనిలేదు. మా పార్టీ వ్యవహారాలనే మేం పట్టించుకుంటాం. మేం ఇతర పార్టీల నిర్ణయాల జోలికి వెళ్లం, కానీ ఇతర పార్టీల వారు మా పార్టీలో జరగని అంశాలపై కూడా జరిగినట్టుగా వ్యాఖ్యానించడం వారిలో ఉన్న ఆందోళనను తెలియజేస్తోంది.
ఎన్నికల్లో బీజేపీ ఏ ప్రణాళికతో వెళ్లాలన్నది మా పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. దీనిపై ఇతర పార్టీలు ఆందోళన చెందాల్సిన పనిలేదు” అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.