- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- వీడియో షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవి
- ‘వ్యూహం’ సినిమాపై రేగుతున్న వివాదాలు
సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్ లో ఆయన పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్విట్టర్ కంప్లైంట్ ను తన నుంచి వచ్చిన అధికారిక ఫిర్యాదుగా భావించాలని, తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాపై టీడీపీ వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదలను కోర్టు తాత్కాలికంగా ఆపేసింది. ఓటీటీ సహా ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ప్రదర్శించవద్దంటూ సూచించింది. సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. ఈ నెల 29న వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.
వివాదం ఏమిటంటే..
ఆర్జీవి తన కొత్త సినిమా వ్యూహంలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు. తమ అభిమాన నాయకులను కించపరచడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసరావు టీవీ 5 చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవి తల నరికి తెస్తే రూ. కోటి ఇస్తానని అన్నారు. యాంకర్ వారిస్తున్నా పదే పదే అవే వ్యాఖ్యలు చేశారు. సమాజం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అన్నారు. ఈ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ.. ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ‘ఏపీ పోలీసులకు విన్నపం. నన్ను చంపేందుకు రూ. కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన టీవీ 5 యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇదే నా అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.