కుక్కపిల్లల కోసం ఎలుగుబంటిని లెక్కచేయని అమెరికా అమ్మాయి!
-కాలిఫోర్నియాలో ఘటన
-ఓ ఇంట్లో ప్రవేశించిన భల్లూకం
-అప్రమత్తమైన పెంపుడు కుక్కలు
-ఒక్కసారిగా దూసుకొచ్చిన టీనేజి అమ్మాయి
-ఉత్తచేతులతోనే ఎలుగుబంటిని నెట్టేసిన వైనం
కొందరు పెంపుడు కుక్కలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటికేమైనా ఆపద వాటిల్లుతుంటే ఎలా తట్టుకోగలరు? ఈ అమెరికా టీనేజి అమ్మాయి కూడా అంతే. తన ఇంట్లో ప్రవేశించిన ఓ పెద్ద ఎలుగుబంటి తన కుక్కపిల్లలపై దాడికి యత్నిస్తుంటే, సివంగిలా ముందుకు దూకిన ఆ అమ్మాయి తన కుక్కపిల్లలను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో టిక్ టాక్ లోనూ, ఇతర సోషల్ మీడియా వేదికలపైనా వైరల్ అవుతోంది.
కాలిఫోర్నియాకు చెందిన 17 ఏళ్ల హెయిలీ మోరినికో చేసిన సాహసం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. హెయిలీ తన ఇంట్లో ఉన్న సమయంలో ఎలుగుబటి ఆమె ఇంటి పెరటి గోడ ఎక్కింది. దీన్ని చూసి కుక్కలన్నీ దానివెంటపడ్డాయి. ఎలుగుబంటి ఎంతో బలమైనది కావడంతో ఆ కుక్కలపై దాడికి దిగింది.
ప్రమాదాన్ని గ్రహించిన హెయిలీ రాకెట్లా దూసుకువచ్చి, గోడపై ఉన్న ఎలుగుబంటిని తన చేతులతోనే ఎదుర్కొంది. దాన్ని గోడపై నుంచి బలంగా నెట్టివేయడంతో ఆ ఎలుగు అవతలికి పడిపోయింది. ఇదే అదనుగా హెయిలీ తన పెంపుడు కుక్కను చేతుల్లోకి తీసుకుని అక్కడ్నించి వచ్చేసింది. మొత్తానికి ఓ సూపర్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకుంది.