ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్.. పలు జిల్లాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-గన్‌పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులు
-సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
-సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ
-ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే, ఈ రోజు ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం నాటి ఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు తెలంగాణ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.
కరోనా వేళ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు పతాకావిష్కరణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.