- ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన అనిల్
- నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజ్ చేసిన జగన్
- జగన్ ప్రపోజల్ కు అనిల్ ఓకే చెప్పినట్టు సమాచారం
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ తమ అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లతో నాలుగు జాబితాలు విడుదల చేసింది. ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగులు టికెట్లను కోల్పోగా, చాలా మంది సిట్టింగులకు స్థాన చలనం కలిగింది.
తాజాగా ముఖ్యమంత్రి జగన్ తో నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అనిల్ కుమార్ యాదవ్ తో జగన్ చర్చించారు. నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనిల్ కు జగన్ సూచించారు. జగన్ ప్రపోజల్ కు అనిల్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
లావు శ్రీకృష్ణ దేవరాయ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఈసారి ఆయన ఆ స్థానంలో గెలవలేరనే నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఆ స్థానంలో బీసీని నిలబెడితే గెలిచే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే, అనిల్ వైపు జగన్ మొగ్గుచూపారు.