- సౌదీ అరేబియాలో పొరపాటున ఓ బాలుడి మృతికి కారణమైన అబ్దుల్ రహీం
- 2006లో ఘటన.. అప్పటి నుంచి సౌదీ జైల్లోనే మగ్గుతున్న కేరళ వ్యక్తి
- 2018లో అబ్దుల్‌కు మరణశిక్ష విధించిన సౌదీ న్యాయస్థానం
- ఆ తర్వాత ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకారం
- రూ. 34 కోట్లు పోగుచేసి పెద్దమనసు చాటిన కేరళీయులు
సౌదీ అరేబియాలో ఓ కుటుంబం వద్ద సంరక్షకుడిగా పనిచేసిన కేరళ వ్యక్తి పొరపాటు ఆ ఫ్యామిలీలోని ఓ బాలుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అక్కడి న్యాయస్థానం ఆ వ్యక్తికి మరణశిక్ష విధించింది. అయితే, కొన్నాళ్లకు ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీలోగా సుమారు రూ. 34 కోట్లు చెల్లించినట్లయితే మరణశిక్ష తప్పే వీలుంది. దాంతో తాజాగా ఈ పెద్ద మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు సమీకరించి పెద్దమనసు చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీం సౌదీలోని ఓ కుటుంబం వద్ద కేర్ టేకర్‌గా పనికి కుదిరాడు. ఆ ఫ్యామిలీలోని ప్రత్యేక అవసరాల బాలుడికి సంరక్షకుడిగా ఉండడం రహీం పని. అయితే, 2006లో పొరపాటున ఆ బాలుడి మృతికి అతను కారణమయ్యాడు. అప్పటి నుంచి సౌదీ జైల్లోనే ఉన్నాడు.
మరోవైపు బాలుడి ఫ్యామిలీ క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో 2018లో సౌదీ న్యాయస్థానం అబ్దుల్ రహీంకు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లకు ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం ఒప్పుకుంది. దాంతో ఈ నెల 18లోగా సుమారు రూ. 34 కోట్లు చెల్లిస్తే ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
ఈ విషయం తెలుసుకున్న కేరళీయులు ఈ భారీ మొత్తాన్ని సమీకరించి రహీంను విడిపించేందుకు కొందరు ఓ బృందంగా ఏర్పడి నిధుల జమ మొదలు పెట్టారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందించడం జరిగింది. ఈ క్రమంలో 5 రోజుల క్రితం వరకు కూడా కొద్ది మొత్తమే జమ అయింది. ఆ తర్వాత కేరళీయులు భారీగా స్పందించి భారీ మొత్తంలో విరాళాలు అందించడంతో రూ. 34 కోట్లు సమకూరినట్లు తెలుస్తోంది.