Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కొడిగట్టిన పాప్యులారిటీ.. ఓటమి దిశగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్?

  • కన్సర్వేటివ్‌లను గద్దెదించాలన్న యోచనలో బ్రిటన్ ప్రజలు
  • వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదంటున్న సర్వేలు
  • ఆగని వలసలు, ఆర్థిక మందగమనం, భారంగా మారిన వైద్యం వెరసి ఇబ్బందుల్లో రిషి

బ్రిటన్‌కు తొలిభారత సంతతి ప్రధానిగా చరిత్ర సృష్టించిన కన్సర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా? అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. హామీలు నెరవేర్చడంలో వైఫల్యాలు, ప్రతికూల ప్రజాభిప్రాయం వెరసి ఆయనను ఓటమి దిశగా నడిపిస్తున్నాయని చెబుతున్నారు. బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 18 నెలల కాలంలో ఆయన రెండు పర్యాయాలు పన్నుల్లో కోతలు విధించారు. ఆర్థిక రంగాన్ని కొంత మెరుగుపరిచారు. కానీ ఇవేవీ రిషి సునాక్‌కు రాజకీయంగా లాభించట్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీని గద్దె దించాలని ప్రజలు కంకణం కట్టుకున్నట్టు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. తనకు రోజురోజుకూ మద్దతు తగ్గిపోతున్న నేపథ్యంలో రిషి సునాక్ నిస్సహాయంగా కనిపిస్తున్నారని రాజకీయశాస్త్రవేత్త రాబ్ ఫోర్డ్ వ్యాఖ్యానించారు. 

గతనెలలో జరిగిన యూగొవ్ సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ కేవలం 154 సీట్లు గెలవొచ్చని తేలింది. కీర్ స్టేమర్ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఏకంగా 403 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు వెల్లడైంది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిషికి ప్రతిబంధకంగా మారినా కొన్ని స్వయంకృతాపరాథాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం, సునాక్ దేశంలోకి వలసలను నిరోధించలేకపోయారని, ఫ్రాన్స్‌ నుంచి బోట్లల్లో కాందీశీకులు బ్రిటన్‌కు వస్తున్నారని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గినా ఆర్థికరంగంలో పురోగతి లేదని చెబుతున్నారు. నేషనల్ హెల్త్ సర్వీసుల్లో వెయిటింగ్ లిస్టు నానాటికీ పెరుగుతూ బ్రిటన్ ప్రజలను ఇబ్బందులు పెడుతోందని అంటున్నారు. 

మార్చిలో వెలువడిన ఓ సర్వే ప్రకారం, దేశ ఓటర్లలో 58 శాతం మంది కన్సర్వేటివ్‌లకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సర్వేలో రిషి సునాక్‌కు ఏకంగా మైనస్ 38 రేటింగ్ రావడం గమనార్హం. సాధారణ బ్రిటన్ ప్రజానీకానికి రిషి దూరమయ్యారని అక్కడి రాజకీయ నిపుణులు వ్యాఖ్యనిస్తున్నారు. కాగా, రిషి సునాక్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts

చైనా ఓ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలిపోవచ్చు: అమెరికా అధ్యక్షుడు బైడెన్

Ram Narayana

ఎన్నికల కవరేజీకి అనుమతివ్వలేదన్న విదేశీ జర్నలిస్టు.. స్పందించిన కేంద్రం

Ram Narayana

చంద్రుడిపైన భూకంపాల తీవ్రత 20 రెట్లు ఎక్కువట..!

Ram Narayana

Leave a Comment