- ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య
- దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారన్న దాడి చేసిన వ్యక్తులు
- సైన్యాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు
ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కొందరు చేయిచేసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. కన్హయ్యపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వీడియోను విడుదల చేశారు. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని… అందుకే అతనిపై దాడి చేశామని వీడియోలో పేర్కొన్నారు. భారతీయ సైన్యాన్ని ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
కన్హయ్య కుమార్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎనిమిది మంది వరకు వచ్చారు. తొలుత ఆయనకు పూలమాల వేశారు. ఆ తర్వాత ఇంకు చల్లారు. అనంతరం ఆయనపై పంచ్ లు విసిరారు. ఈ దాడిలో నలుగురు మహిళలు కూడా గాయపడ్డారు. ఓ మహిళా జర్నలిస్టు పక్కనే ఉన్న మురుగునీటి కాల్వలో పడిపోయింది. కన్హయ్యపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలను ఏ పార్టీ కూడా సమర్థించకూడదని వ్యాఖ్యానించింది.