- ప్రతి రాష్ట్రంలో ఏసీబీ ఉన్నప్పుడు మళ్లీ సీబీఐ ఎందుకన్న అఖిలేశ్ యాదవ్
- మోసం చేస్తే ఆ విషయాన్ని ఆదాయపన్నుశాఖ చూసుకుంటుందన్న ఎస్పీ చీఫ్
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ రెండింటిని మూసేయాలని ప్రతిపాదిస్తానని స్పష్టీకరణ
ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేయాలని ప్రతిపాదిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
‘‘మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఆదాయపన్నుశాఖ చూసుకుంటుంది. ఆ మాత్రానికి సీబీఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ఉంది. కావాలంటే దానిని ఉపయోగించుకోవచ్చు’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకుంటున్నదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అన్న ప్రశ్నకు అఖిలేశ్ బదులిస్తూ.. ఇది తన ప్రతిపాదన మాత్రమేనని, దానిని కూటమి ముందు ఉంచుతానని స్పష్టం చేశారు.