- ఏలూరు జిల్లా కైకలూరులో ఘటన
- పదో తరగతి మార్కుల జాబితా తీసుకునేందుకు స్కూలుకు వచ్చిన బాలిక
- అత్యాచారం చేసిన సహ విద్యార్థి… వీడియో తీసిన నలుగురు యువకులు
- కోరిక తీర్చాలంటూ బాలికకు బెదిరింపులు
- ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్
ఏలూరు జిల్లా కైకలూరులో తరగతి గదిలో ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడగా, ఆ అత్యాచార ఘటనను నలుగురు యువకులు ఫోన్ లో వీడియో తీశారు. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి, పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మైనర్ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, షెల్టర్ హోమ్ ద్వారా రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. అండగా ఉంటామని బాధితురాలి తల్లికి భరోసా ఇచ్చారు.
అయితే, ఈసీ నిబంధనలు అడ్డొస్తున్నాయని తెలిపారు. మహిళలకు అండగా నిలబడవలసిన సమయంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సరికాదని మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలికలకు అవగాహన కలిగించేందుకు, మహిళలకు అండగా నిలబడేందుకు మహిళా కమిషన్ కు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు.
“ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం చేయగా, వీడియో తీసిన యువకులు కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్ లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు. సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు” అంటూ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.