- రోహిత్… పిచ్ రుచి ఎలా ఉందన్న సరదాగా అడిగిన మోదీ
- క్లిష్ట పరిస్థితుల్లో మంచి స్కోర్ చేయడం ఎలా అనిపించిందని అక్షర్‌ను అడిగిన ప్రధాని
- ఆశలు వదులుకున్న సమయంలో తక్కువ పరుగులిచ్చిన బూమ్రాకు కితాబు
టీ20 ప్రపంచకప్ సాధించిన విజయగర్వంతో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా… నేరుగా ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంది. ప్రధాని అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. పర్యటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకున్నారని ప్రశంసించారు. ఒక్కో ఆటగాడిని పలకరించారు. ప్రశ్నలతో అందర్నీ నవ్వించారు.
ఫైనల్ మ్యాచ్‌లో విజయం తర్వాత రోహిత్ శర్మ మైదానంలో అలాగే బోర్లా పడుకొని లేచి… ఆ తర్వాత పిచ్‌పై ఉన్న మట్టిని రెండుసార్లు నోట్లో వేసుకున్నాడు. దీనిని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, ‘రోహిత్… పిచ్ రుచి ఎలా ఉంది?’ అని సరదాగా ప్రశ్నించారు.
క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి మంచి స్కోర్ చేయడం ఎలా అనిపించిందని అక్షర్ పటేల్‌ను అడిగారు. ఫైనల్ మ్యాచ్‌లో మూడో డౌన్‌లో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. కీలక సమయంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
టీమిండియా ఆశలు వదులుకున్న సమయంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బూమ్రాను మోదీ ప్రశంసించారు. ఒత్తిడిలో ఓవర్ వేసే సమయంలో బూమ్రా మదిలో ఏం మెదిలిందో? అని సరదాగా అడిగారు.
టోర్నీ ఆసాంతం పాండ్యా తీరుపై మోదీ ఆరా తీశారు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్‌ను అభినందించారు.