ఓయూలో జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడిని ఖండిద్దాం
అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
HUJ-TUWJ నేతలు
ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుశంగా పోలీసులు లాక్కేళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) అధ్యక్షులు శిగ శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజులు ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి శ్రీ చరణ్ పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లడమే కాకుండా, కెమెరాలను తీయొద్దంటూ బెదిరించడం దారుణమన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం అడప దడప జరుగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన పోలీసుల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా?: కేటీఆర్
- జర్నలిస్ట్‌ల పట్ల పోలీసుల వైఖరిని ఖండించిన కేటీఆర్
- నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం
- ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే… విధి నిర్వహణలో భాగంగా కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌ల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్ట్‌ల పట్ల పోలీసుల వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.