Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రధాని మోదీ హెచ్చరికతో.. సరిహద్దులో అదనపు బలగాలను మోహరిస్తున్న పాకిస్థాన్…

  • 23వ పదాతిదళ డివిజన్‌లో అదనపు బలగాలతో భద్రత
  • పీవోకేలోని సీనియర్ అధికారులతో మాట్లాడిన పాక్ ఆర్మీ చీఫ్
  • కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఉగ్రవాదంపై దాయాది దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోదీ

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ‘ఉగ్రవాద పోషకులు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌కు దాయాది దేశం పాకిస్థాన్‌ ఉలిక్కిపడింది. ఆ దేశవ్యాప్తంగా కలవరం కనిపించింది. దీంతో పాక్ ఆర్మీ భారత్ సరిహద్దుకు అదనపు బలగాలను పంపించింది. 23వ పదాతిదళ డివిజన్‌లోని 3-పీవోకే బ్రిగేడ్, 2-పీవోకే బ్రిగేడ్‌లలో అదనపు బలగాలను మోహరించింది. ఈ మేరకు వెనుక సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కోసం అదనపు భద్రతను మోహరించినట్లు వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సీనియర్ అధికారులందరితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు నియంత్రణ రేఖని భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. భారత భూభాగాల్లో దాక్కొని ఉంటారని భావిస్తున్న 55-60 మంది ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ గాలిస్తోంది. ఇటీవల పీవోకేలోని పాక్ ఆర్మీ అధికారులు, స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జి) బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులతో పాటు ఉగ్రవాదులు ఒకే చోట ఉన్నట్టు భారత భద్రతా ఏజెన్సీలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇక సరిహద్దు ప్రాంతాలలో అనేక మంది ఉగ్రవాదులతో పాకిస్థాన్ రేంజర్లు కనిపించారు. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది.

ద్రాస్ నుంచి పాకిస్థాన్‌కు మోదీ హెచ్చరిక
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ‘ద్రాస్ వార్ మెమోరియల్’ వద్ద కార్గిల్ యుద్ధ అమరవీరులకు మోదీ నివాళులు అర్పించారు. ‘‘ఉగ్రవాదంలో ఆరితేరిన వారు నా గొంతును నేరుగా వినగలిగే ప్రదేశం నుంచి మాట్లాడుతున్నాను. దుర్మార్గపు ఉద్దేశాలు ఎప్పటికీ ఫలించబోవని ఈ ఉగ్రవాద పోషకులకు నేను చెప్పాలనుకుంటున్నాను. మా సైనికులు తీవ్రవాదాన్ని అణచివేస్తారు. లడఖ్ అయినా, జమ్మూ కశ్మీర్ అయినా అభివృద్ధి పథంలో వచ్చే ప్రతి సవాలునూ భారత్ ఓడిస్తుంది’’ అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దుష్ట విధానాలు ఎప్పటికీ విజయవంతం కాబోవని మోదీ గట్టి సందేశాన్ని ఇచ్చారు. చరిత్ర నుంచి పాకిస్థాన్ ఏమీ నేర్చుకోలేదని మోదీ విమర్శించారు.

Related posts

ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. స్పందించిన ఇస్రో చీఫ్

Ram Narayana

బీజేపీని ఓడించలేమని తేల్చేసింది: కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ..!

Drukpadam

జ్ఞానవాపి మసీదు కింద దొరికినవి ఇవే..!

Ram Narayana

Leave a Comment