వ్యవసాయశాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారింది: షర్మిల
- రైతుల ఆశలను కూటమి సర్కారు ఆవిరి చేస్తోందన్న షర్మిల
- రైతులు కోరిన విత్తనాలు ఇవ్వడంలేదని ఆరోపణ
- 48 గంటల్లో జేజీఎల్-384 రకం విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్
నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద సాగునీరు వచ్చిందని సంతోషపడే లోపే, వ్యవసాయశాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. డిమాండ్ ఉన్న పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల ఆశలను పూర్తిగా ఆవిరి చేస్తున్నారని, క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తీసుకువద్దామనే రైతుల ఆశను మళ్లీ చంపుతున్నారని షర్మిల మండిపడ్డారు.
“పోలీసులను కాపలా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటి? పదో, పరకో ఇచ్చి కౌంటర్లు మూసేయడం ఏంటి? రైతులు అడిగింది కాకుండా, సర్కారుకు నచ్చిన విత్తన రకం కొనాలని ఒత్తిడి చేయడం ఏంటి? మహిళలు అని చూడకుండా విత్తనాల కోసం వర్షంలో నిలబెడతారా? తొక్కిసలాట జరుగుతుంటే చోద్యం చూస్తారా?
రైతు పక్షపాతి అని చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి ఇది తగునా? పది రోజులుగా కాళ్లు అరిగేలా రైతులు విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కనిపించడం లేదా?” అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
వెంటనే, 48 గంటల్లో జేజీఎల్-384 రకం విత్తనాలు 15 వేల క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ విత్తనాన్ని సైతం రాయితీ జాబితాలో చేర్చాలని కోరారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.