కోల్‌కతా రేప్ కేసు గుర్తుందిగా… ముంబై డాక్టర్‌ను బెదిరించిన 16 ఏళ్ల బాలుడు
- తన క్లినిక్ ఎదుట పార్క్ చేసిన బైక్‌ను తీయమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడు
- వైద్యురాలితో వాగ్వాదం.. స్నేహితులతో కలిసి దాడి
- కోల్‌కతా వైద్యురాలికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక
తన క్లినిక్ ఎదుట పార్క్ చేసిన బైక్‌ను తీయమన్నందుకు 16 ఏళ్ల బాలుడు తీవ్రంగా స్పందించాడు. ‘కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచార ఘటన గుర్తుందిగా.. నీక్కూడా అదే గతి పడుతుంది’ అని వైద్యురాలిని హెచ్చరించాడు. ముంబైలోని మన్‌ఖుర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
సాథే నగర్‌లో వైద్యురాలు నిర్వహిస్తున్న క్లినిక్‌కు ఎదురుగా బాలుడు నిన్న మధ్యాహ్నం తన స్కూటర్‌ను పార్క్ చేశాడు. గమనించిన వైద్యురాలు అక్కడి నుంచి దానిని తీయాలని కోరారు. దీంతో బాలుడు కోపంతో ఊగిపోతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను గుర్తు చేస్తూ ఆమెకు హెచ్చరికలు జారీచేశాడు.
అంతేకాదు, మరికొందరితో కలిసి తన భార్యపై బాలుడు దాడిచేసినట్టు బాధిత వైద్యురాలి భర్త ఆరోపించారు. తమకు సత్వర న్యాయం జరగాలని, నిందితుడు బాలుడు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.