భారత్‌పై ప్రభావం ఉంటుందా?.. శాస్త్రవేత్తల సమాధానం ఇదే
మరో భారీ సౌర తుపాను ముప్పు ముంచుకొస్తోంది. భూమిని తాకనున్న ఈ సౌర తుపాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను భూమి వైపు దూసుకొస్తున్నందున రానున్న కొన్ని రోజులు కీలకమని పేర్కొన్నారు.
కాగా సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుపానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో పాటు శాటిలైట్స్‌కు కూడా అంతరాయం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సౌర తుపానును భారత శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ భారత ఉపగ్రహ ఆపరేటర్లను ఇస్రో నిపుణులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.
ఈ సౌర తుపాను భారత్‌పై ఏవిధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణియన్ మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం సూర్యుడిపై సంభవించిన జ్వలనాలు.. ఈ ఏడాది మే నెలలో సంభవించిన జ్వలనాలతో సమానమని చెప్పారు. ఈ సౌర తుపాను భూమిని తాకడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఇక భారత్‌పై ఈ తుపాను ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చని అన్నారు. వేచి చూడాల్సి ఉంటుందని డాక్టర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మే నెలలో బలమైన సౌర తుఫాను భూమిని తాకిన విషయం తెలిసిందే.