370 రద్దు సరైందికాదని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చినట్లేనా …?
కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫెరెన్స్ అన్న మాట నిలబెట్టు కుంటాయా ..
కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్ర హోదా కల్పిస్తారా …
బీజేపీని నమ్మని కాశ్మిర్ ఓటర్లు …సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్ అభ్యర్థి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు వంటి నిర్ణయాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ ప్రజలు ఎన్సీ-కాంగ్రెస్ కూటమివైపే మొగ్గు చూపారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామన్న వాగ్దానాన్ని నమ్మి- ఆ రెండు పార్టీలకే పట్టం కట్టారు. పీడీపీ కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా- గతంలో బీజేపీతో జట్టు కట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని నమ్మలేదు. మొత్తానికి జమ్ముకశ్మీర్లో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వేయగా, అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.