- ‘భారత్ గర్వించదగిన పుత్రుడు’ అని టాటాను కొనియాడిన ఇజ్రాయెల్ ప్రధాని
- భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్ రతన్ టాటా అంటూ మననం చేసుకున్న బెంజమన్ నెతన్యాహు
- తన సంతాపాన్ని టాటా కుటుంబానికి తెలియజేయాలని మోదీకి విజ్ఞప్తి
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్‌గా రతన్ టాటాను ఆయన కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా శనివారం రాత్రి తన సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ‘భారత్ గర్వించదగిన పుత్రుడు అని కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను పెంపొందించడంలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.
‘‘ఇజ్రాయెల్‌లోని చాలామంది ప్రజలతో పాటు నేను కూడా రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. రతన్ టాటా భారతదేశం గర్వించదగిన పుత్రుడు. మన రెండు దేశాల మధ్య స్నేహబంధానికి ఛాంపియన్ అయిన రతన్ టాటాను కోల్పోవడం విచారకరం. దయచేసి రతన్ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేయండి’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని బెంజమన్ నెతన్యాహు కోరారు. కాగా రతన్ టాటా మరణం పట్ల ఇజ్రాయెల్ ప్రధానితో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
టాటా గ్రూప్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన రతన్ టాటా అక్టోబర్ 9న కన్నుమూశారు. 86 సంవత్సరాల వయస్సులో చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.