- మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- బతుకమ్మ సంబరాల్లో ఎక్కువ శబ్ద తీవ్రతతో పాటలు పెట్టారన్న అభియోగంపై సుమోటోగా కేసు
- పోలీసుల తీరుపై ప్రశంసలు
చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా బతుకమ్మ సంబరాల్లో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమతించిన సమయానికి మించి, ఎక్కువ శబ్ద తీవ్రతతో పాటలు పెట్టారని బంజారా హిల్స్ పోలీసులు సుమోటాగా స్వీకరించి మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి ఈ ఏడాది మార్చి చివరి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మరోపక్క నిబంధనల విషయంలో రాజీపడకుండా పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.