ఆయనని చూస్తే మనస్సు తరుక్కుపోతోంది…
- జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి
- ఏం జరుగుతుందో… ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్న సీనియర్ నేత
- రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
ఈ వయస్సులో జీవన్ రెడ్డిని చూస్తే మనస్సు తరుక్కుపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య, తదనంతర పరిణామాలు, అధిష్ఠానానికి జీవన్ రెడ్డి లేఖ నేపథ్యంలో జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిందన్నారు. కానీ ఇప్పుడు అడుగడుగునా కష్టాలు రావడం చూస్తే బాధేస్తోందన్నారు.
నిన్న జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సమయంలో చాలా ఆవేదన చెందారని, ఇది చూసి తాను చాలా బాధపడ్డానని జగ్గారెడ్డి అన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, ఏం మాట్లాడాలో తెలియడం లేదని, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నామన్నారు. ఇబ్బందికర సమయంలో నేను అండగా ఉన్నానని చెప్పడానికే మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని… కానీ జీవన్ రెడ్డి మాత్రం ఒంటరి అని ఎవరూ భావించవద్దని స్పష్టం చేశారు. తామిద్దరం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటామని, కానీ తనను సంగారెడ్డిలో, జీవన్ రెడ్డిని జగిత్యాలలో ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదన్నారు. జీవన్ రెడ్డి అంశంపై అధిష్ఠానం దృష్టి సారించాలన్నారు.