- గతేడాది ఆగస్టులో పంకజ్ లాంబాను వివాహం చేసుకున్న హర్షిత బ్రెల్లా
- ఈ నెల 14న కారు డిక్కీలో శవమై కనిపించిన హర్షిత
- ఆ తర్వాతి నుంచి పరారీలో పంకజ్
- పెళ్లయినప్పటి నుంచీ హర్షితకు వేధింపులు
- భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు కారు డిక్కీలో వేసుకుని 145 కిలోమీటర్ల ప్రయాణం
- పంకజ్ కోసం పోలీసుల గాలింపు
ఢిల్లీలో జన్మించిన 24 ఏళ్ల హర్షిత బ్రెల్లా గతేడాది ఆగస్టులో పంకజ్ లాంబాను వివాహం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భర్తతో కలిసి బ్రిటన్ వెళ్లింది. ఇటీవల ఆమె నార్తాంప్టన్‌షైర్‌లోని తన ఇంటి నుంచి అదృశ్యమైంది. నవంబర్ 14న తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్‌లో బ్రిస్బేన్ రోడ్‌లో పార్క్ చేసిన వాహనం డిక్కీలో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. హర్షితను గొంతు నులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలింది.
హర్షితను ఆమె భర్త పంకజ్ (23) హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను హత్య చేసిన అనంతరం అతడు దేశం విడిచి పారిపోయాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు డిక్కీలో వేసిన అనంతరం నార్తాంప్టన్‌షైర్ నుంచి ఇల్‌ఫోర్డ్ వరకు 145 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన 60కిపైగా డిటెక్టివ్‌లు ఇల్లిల్లూ వెతుకుతున్నారు. సీసీటీవీలు, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు(ఏఎన్‌పీఆర్)ను శోధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ నెల 10న సాయంత్రం హర్షిత చివరిసారి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. డిన్నర్ రెడీ చేస్తున్నానని, భర్త కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. అయితే, ఆ తర్వాత రెండ్రోలపాటు ఆమె ఫోన్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. 13న నార్తాంప్టన్‌షైర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఆమె కనిపించకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున ఇల్‌ఫోర్డ్‌లో హర్షిత మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన తర్వాత పంకజ్ అదృశ్యమయ్యాడు.
హర్షిత గృహహింసకు గురైనట్టు విచారణలో వెల్లడైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భర్త పెట్టే హింస నుంచి రక్షణ కల్పిస్తూ ఆమె భర్తపై గృహ హింస రక్షణ ఆదేశాలు (డీవీపీవో) జారీ అయ్యాయి. చట్టపరంగా ఆమెకు రక్షణ లభించినప్పటికీ భర్త నుంచి ముప్పు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆమె హత్యకు గురికావడానికి ముందు వారింట్లో నుంచి అరుపులు వినిపించేవని ఇరుగుపొరుగువారు తెలిపారు.
లండన్‌లో తన సోదరి హర్షిత ఓ వేర్‌హౌస్‌లో పనిచేస్తుండగా, పంకజ్ చదువుకునే వాడని హర్షిత సోదరి సోనియా దేబాస్ తెలిపింది. పంకజ్ వేధింపులు భరించలేక గతంలో ఒకసారి ఇంటికి వచ్చేసిందని, అయితే, అంతా సర్దుకుంటుందన్న ఆశతో మళ్లీ వెళ్లిందని తెలిపింది. హర్షితకు టీచర్ కావాలని ఉండేదని ఆమె తండ్రి సత్బీర్ బ్రెల్లా ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇది తాము చూసిన సంబంధమేనని పేర్కొన్నారు.