- మండలిలో వైసీపీ నేతలపై మంత్రి సత్యకుమార్ విమర్శలు
- వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్టుందన్న వ్యాఖ్య
- సత్యకుమార్ హజ్ యాత్ర వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం
- సత్యకుమార్ హజ్ యాత్ర గౌరవం పెంచేలా మాట్లాడారన్న అచ్చెన్న
- తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్న సత్యకుమార్
రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. అయితే, మంత్రి హజ్ యాత్రను ప్రస్తావించడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సత్యకుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.
దీనిపై మరో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, తాము హజ్ యాత్రను ఎక్కడా అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. హజ్ యాత్ర గౌరవం పెంచేలాగానే మంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. సత్యకుమార్ అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.
తన వ్యాఖ్యల పట్ల మండలిలో రగడ నెలకొనడం పట్ల మంత్రి సత్యకుమార్ స్పందించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉందని భావిస్తే వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు.