- బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారన్న మహేశ్ కుమార్ గౌడ్
- ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
- బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వ్యాఖ్య
బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్ కు సూచించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. మతతత్వ ప్రచారంతో బీజేపీ లబ్ధి పొందుతోందని చెప్పారు.