- భారత సంతతి వ్యక్తులకు పెద్దపీట వేస్తున్న ట్రంప్
- ఇప్పటికే పలు కీలక స్థానాల్లో నియమించిన ట్రంప్
- ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా పేరు సంపాదించుకున్న కాష్ పటేల్
- తొలి దఫాలో అందించిన సేవలపై ట్రంప్ ప్రశంసలు
- అమెరికన్ల రక్షణ కోసం తన కెరియర్‌ను అంకితం చేశారన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగంలో భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించిన ఆయన తాజాగా.. అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్‌గా ఇండోఅమెరికన్ కాష్ పటేల్ (44)ను నామినేట్ చేశారు. ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా కాష్‌ను చెప్పుకుంటారు.
కాష్ తెలివైన లాయర్, పరిశోధకుడని ట్రంప్ ప్రశంసించారు. అమెరికా తొలి పోరాట యోధుడని, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్లను రక్షించేందుకు ఆయన తన కెరియర్‌ను అంకితం చేశారని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్’లో కొనియాడారు. తన మొదటి పదవీకాలంలో పటేల్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రష్యా బూటకాలను బహిర్గతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ వ్రే పనితీరుపై అసంతృప్తి కారణంగా కాష్ పటేల్‌ను ట్రంప్ నియమించినట్టు తెలుస్తోంది. క్రిస్టోఫర్ 2017లో ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమితులయ్యారు.
పటేల్ జర్నీ ఇలా..
తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్థిరపడిన గుజరాతీ మూలాలున్న కుటుంబంలో కాష్ పటేల్ జన్మించారు. లా పూర్తి చేసిన తర్వాత ఫ్లోరిడాలో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో న్యాయవాదిగా చేరారు. తూర్పు ఆఫ్రికా, అమెరికాలో అంతర్జాతీయ ఉగ్రవాద కేసులను వాదించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో సివిల్ లాయర్‌గా చేరిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ట్రంప్ మొదటి పదవీకాలంలో పటేల్ కీలక పాత్ర పోషించారు.