- పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు
- చిన్నప్పుడు తప్పిపోయాను… ఇప్పుడు తిరిగొచ్చానంటూ టోకరా
- పోలీసులనే నమ్మించిన ఘనుడు
- నేను మీ వాడ్నే అంటూ 9 ఇళ్లలో చోరీలు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 30 ఏళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడని, చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన ఆ వ్యక్తి తిరిగిరావడంతో ఆ కుటుంబం సంతోషసాగరంలో మునిగితేలుతోందని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, అసలు వాస్తవం తెలిసిన తర్వాత అందరూ విస్తుపోయారు.
తిరిగొచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తి ఘరానా మోసగాడు అని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ వ్యక్తికి, సదరు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కూడా పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకెళితే… ఆ మోసగాడి పేరు ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్. అతడు రాజస్థాన్ కు చెందిన వాడు. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు 1993లో కిడ్నాప్ కు గురయ్యానని, తాను ఘజియాబాద్ లోని ఓ కుటుంబానికి చెందినవాడ్నంటూ యూపీ పోలీసులను ఆశ్రయించాడు. అతడు చెప్పింది నిజమే అని నమ్మిన పోలీసులు ఆ మేరకు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. అతడి బంధువులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ వ్యక్తికి దుస్తులు ఇచ్చి, వారం రోజుల పాటు తిండి పెట్టారు.
సదరు కుటుంబం పత్రికల్లో వ్యక్తి ఫొటోలు చూసి, అతడు తమ కుటుంబానికి చెందినవాడే అని భావించి పోలీసులను సంప్రదించారు. ఎందుకంటే, ఆ కుటుంబం నుంచి ఒక బాలుడు చిన్నప్పుడే తప్పిపోయాడు. అతడే తమ అబ్బాయి అయ్యుంటాడని వారు నమ్మారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని ఆ కుటుంబం వారు కలుసుకుని తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఈ ఘరానా మోసగాడు కూడా ఈ సందర్భంగా కొన్ని ఎమోషనల్ డైలాగులతో రక్తి కట్టించాడు. కథ సుఖాంతమైందని పోలీసులు కూడా అనుకున్నారు. కానీ, కథ ఇక్కడే మలుపు తిరిగింది.
రాజు వ్యవహార శైలిపై ఆ కుటుంబం అనుమానించింది. వచ్చీ రావడంతోనే మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అంటూ అతడు ఆరా తీస్తుండడం వారిలో అనుమాన బీజాలు నాటింది. వారు పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని డీఎన్ఏ టెస్టు నిర్వహించారు. ఆ కుటుంబం డీఎన్ఏకి, రాజు డీఎన్ఏకి తేడా ఉండడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో తన నేరాలు అన్నింటిని రాజు బయటపెట్టేశాడు.
రాజుకు దొంగతనాలు అలవాటు కావడంతో 2005లో ఇంటి నుంచి బయటికి పంపించేశారు. తల్లి కూడా మరణించడంతో, ఇక అతడు ఇంటికి తిరిగి వెళ్లలేదు. తన అసలు పేరు ఎక్కడా చెప్పుకోకుండా, ఏదో రకంగా మోసం చేసి ఇతరుల ఇళ్లలో తిష్ట వేసేవాడు. తనపై ఆ ఇంటి వాళ్లకు నమ్మకం కుదిరాక, వారు నగలు, నగదు ఎక్కడ పెడతారో తెలుసుకుని, వాటిని తీసుకుని ఉడాయించేవాడు. ఇలా 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు.
కాగా, 2021లో ఓసారి పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదు. పంజాబ్, రాజస్థాన్ లోని జైసల్మేర్, హర్యానాలోని సిర్సా, హిసార్ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఇతర రాష్ట్రాల్లో అతడు మకాం వేసి చోరీలకు పాల్పడిన ఇళ్లకు ప్రత్యేక బృందాలు వెళ్లనున్నాయి.