- మసీదుల సర్వే, తవ్వకాలపై సభలో మండిపడ్డ మజ్లిస్ ఎంపీ
- వక్ఫ్ ఆస్తులను లాగేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
- మైనారిటీలకు ఇప్పటికీ అధికారం దక్కడంలేదంటూ ఆవేదన
దేశవ్యాప్తంగా మసీదులపై దాడులు జరుగుతున్నాయని, సర్వేల పేరుతో తవ్వకాలు జరుపుతున్నారని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను లాగేసుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉన్న చోట దాదాపు 500 ఏళ్ల క్రితం మసీదు ఉండేదని ఆరోపిస్తే తవ్వకాలు జరిపిస్తారా అని నిలదీశారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఏదో ఒకటి (మసీదు ఆనవాళ్లు) బయటపడుతుందని, అంతమాత్రాన పార్లమెంట్ ముస్లింల సొంతం చేస్తారా అని ప్రశ్నించారు.
ఈమేరకు శనివారం నాడు లోక్ సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. దాదాపు 9 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో దేశంలో మైనారిటీల హక్కుల కోసం పలు ప్రశ్నలు సంధించారు.
75 ఏళ్ల క్రితం బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగానే ఇప్పటికీ జరుగుతోందని, దేశంలో మైనారిటీల పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలతో అధికారాన్ని పంచుకోవడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదని ఆరోపించారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత హక్కులు కూడా మైనారిటీలకు దక్కడంలేదని, ముస్లిం యువతులు విద్యాలయాల్లో హిజాబ్ ధరించకుండా అడ్డుకుంటున్నారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.