- రెండు పీరియడ్లు మ్యాథ్స్ క్లాసే విన్నట్లు ఉందంటూ ఎద్దేవా
- ఒక్క కొత్త విషయమూ మోదీ ప్రస్తావించలేదని విమర్శ
- అమిత్ షా తల పట్టుకున్నాడన్న ప్రియాంకా గాంధీ
లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం స్కూలులో లెక్కల పీరియడ్ లాగా బోర్ కొట్టిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సెటైర్ వేశారు. మ్యాథ్స్ సర్ వరుసగా రెండు పీరియడ్లు తీసుకుంటే పిల్లలు ఎలా ఫీలవుతారో తాను కూడా అలాగే ఫీలయ్యానని చెప్పారు. తనకు మాత్రమే కాదు బీజేపీ సీనియర్లకూ అలాగే అనిపించినట్లు ఉందనేందుకు మోదీ ప్రసంగించే సమయంలో వారి హావాభావాలే నిదర్శనమని అన్నారు. ఓవైపు మోదీ ప్రసంగిస్తుండగా అమిత్ షా తలపట్టుకున్నాడని, నడ్డా చేతులు నలుపుకుంటూ కూర్చున్నాడని, పీయూష్ గోయెల్ నిద్ర పోయారని ఆరోపించారు.
సభలో తొలిసారి ప్రధాని ప్రసంగం వింటుండడంతో ఆయన ఏదైనా కొత్త విషయం చెబుతారని తాను ఆసక్తిగా ఎదురుచూసినట్లు ప్రియాంకా గాంధీ చెప్పారు. అయితే, దాదాపు రెండు గంటల పాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో మోదీ ఒక్క కొత్త విషయం కానీ, ఒక్క మంచి విషయం కానీ చెప్పలేదని విమర్శించారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ కూడా విమర్శలు గుప్పించారు. మోదీ తన స్పీచ్ లో వాట్సాప్ యూనివర్సిటీ సిగ్గుపడే రీతిలో పలు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.