Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

శీతాకాలంలో వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా?

  • చలికాలంలో రక్తనాళాలు సంకోచించడంతో హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి
  • హృదయ సంబంధ సమస్యలకు ఎక్కువ అవకాశం
  • వ్యాయామంతో గుండె ఆరోగ్యం పదిలం అంటున్న వైద్య నిపుణులు

శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి వాతావరణంలో శారీరక చురుకుదనం గణనీయంగా తగ్గుతుంది. చలిని తట్టుకోవడానికి స్వెటర్లు ధరించినా, వెచ్చని పానీయాలు తాగినా… శరీరం చురుకుగా లేకపోతే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

చలికాలంలో రక్తనాళాలు సంకోచించడంతో హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని, ఫలితంగా గుండెపోటు, గుండె సంబంధిత ఇతర సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అంతర్గతంగా అవసరమైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని, చల్లటి వాతావరణం ఉన్నప్పుడు శరీరం సులభంగా వేడిని కోల్పోతుంది కాబట్టి వ్యాయామం చేయడం చాలా ఉత్తమమని సూచిస్తున్నారు.

శీతాకాలంలో వ్యాయామం ప్రయోజనాలు ఇవే
శీతాకాలంలో వ్యాయామం చేస్తే శరీరం బిగుతుగా, దృఢంగా ఉంటుంది. రోజువారీ వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాకుండా కీళ్ల చుట్టూ ఉండే కండరాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. శరీర బరువు సమతుల్యతకు బాగా ఉపయోగపడుతుంది. అత్యంత కీలకమైన రక్త ప్రవాహాన్ని కూడా వ్యాయామం ప్రోత్సహిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరగడంలో దోహద పడుతుంది. శరీరంలో అవసరమైన వేడిని కొనసాగించడంతో పాటు గుండెపై ఒత్తిడిని తగ్గించడంలోనూ వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు, సూర్యకాంతి ద్వారా విటమిన్-డీ కూడా పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుదల, పలు రోగాలను నిరోధించడంలో కూడా ఎక్సర్‌సైజ్ చక్కగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

నీరు తక్కువ తాగితే ప్రమాదమా? ఎక్కువ తాగితే ప్రాణాంతకమా?

Ram Narayana

మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా..? ఇలా చేస్తే చాలు!

Ram Narayana

నీటిని ఎప్పుడు ఎలా తాగితే మంచిదో మీకు తెలుసా?

Ram Narayana

Leave a Comment