Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

రికార్డు కోసం అధికారుల నిర్వాకం… మధ్యప్రదేశ్ జాబితాలో 13 ఏళ్ల బాలుడి పేరు!

రికార్డు కోసం అధికారుల నిర్వాకం… మధ్యప్రదేశ్ జాబితాలో 13 ఏళ్ల బాలుడి పేరు!
-వ్యాక్సిన్  వేయకున్న వేసినట్లు మెసేజ్ … అది చూసి అవాక్కు అయిన తల్లిదండ్రులు
-దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న బాలుడు
-దానిలోని సమాచారాన్ని వాడుకున్న అధికారులు
-మధ్యప్రదేశ్ లో 21న రికార్డు స్థాయిలో 17 .42 లక్షల టీకాలు
-టీకాలు వేయనివారి పేర్లను జోడించిన అధికారులు
-తాము వేయించుకోలేదని పలు ఫిర్యాదులు

 

గత సోమవారం రాత్రి 7.27 గంటలకు భోపాల్ లో నివాసం ఉంటున్న రజత్ దాంగ్రే ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులోని సమాచారం ఏంటంటే… రజత్ కుమారుడు వేదాంత్ దాంగ్రేకు కరోనా టీకాను వేయడం జరిగింది. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సమాచారం రాగానే రజత్ అవాక్కయ్యారు. ఇంతవరకూ దేశంలో 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులే లేకపోగా, 13 ఏళ్ల తన కుమారుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వ్యాక్సిన్ వేశారా? అని అయోమయంలో పడ్డాడు.

ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ కోసం ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

కాగా, ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చాలా మంది తాము టీకాలు తీసుకోకున్నా, తమ సెల్ ఫోన్లకు టీకా తీసుకున్నట్టు సమాచారం, ఆ వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తోందని ఆరోపించారు.

వేదాంత్ దాంగ్రేకు టీకా వేశామని చెప్పిన రోజే, సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. ఆ ముగ్గురూ ఎవరో కూడా తనకు తెలియదని అతను ఆరోపించారు. భోపాల్ లోనే ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ రాకున్నా, ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా మెసేజ్ వచ్చింది. వీరే కాదు… ఇంకా చాలా మంది ఇటువంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీరంతా తాము రెండు డోస్ లను ఎలా పొందాలా? అన్న ఆందోళనలో ఉన్నారు.

Related posts

బ్రిటన్‌లో ఒకే రోజు 93 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు

Drukpadam

ఒమిక్రాన్ ఎఫెక్ట్… అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పునఃసమీక్షించనున్న కేంద్రం!

Drukpadam

మహమ్మారిని ఓడించడంలో భారత్‌కు సహకరిస్తాం: జిన్‌పింగ్‌

Drukpadam

Leave a Comment