కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలు అంటున్న కేశినేని నాని
రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా అంటూ ఎద్దేవా
ప్రజలను కేసీఆర్, జగన్ పిచ్చోళ్లను చేస్తున్నారు విమర్శ
ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్,జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజం
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనే కాకుండా, ఆయన తండ్రి వైయస్సార్ పై కూడా తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలేనని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా అని ఎద్దేవ చేశారు . ఏపీ ప్రజలను జగన్, తెలంగాణ ప్రజలను కేసీఆర్ పిచ్చోళ్లని చేస్తూ ఆడుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
గత ఎన్నికల తర్వాత ఇద్దరు సీఎంలు కౌగిలించుకుని, బొకేలు ఇచ్చుకుంటే… రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని తాను భావించానని నాని అన్నారు. అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరువురూ నాటకాలు ఆడుతున్నారనే విషయం పూర్తిగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇక్కడ జగన్ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాదులో ఆయన చెల్లెలు షర్మిల డ్రామాలు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించలేనంత పిచ్చోళ్లు జనాలు కాదని అన్నారు. 80 శాతం అభివృద్ధి చెందిన అమరావతిని జగన్ వదిలేశారని… ఇప్పుడు కృష్ణా నది కరకట్టను అభివృద్ధి చేస్తానని చెపుతున్నారని… ఆయనను ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
ఇప్పటికైనా జగన్ ,కేసీఆర్ డ్రామాలు కట్టిపెట్టి రైతుల మేలుకోసం ఆలోచించాలని అన్నారు . తమ స్వార్థ ప్రయోజాలకోసం ప్రజలను మోసం చేయద్దని హితవు పలికారు. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇద్దరి నాటకాలను గమనిస్తున్నారని ఇద్దరికీ సమయమం వచ్చినప్పుడు బుద్ది చెప్పటం ఖాయమని అన్నారు.