రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నమ్మశక్యంగా లేదు … పవన్ కళ్యాణ్
-సఖ్యంగా ఉన్నామని కేసీఆర్, జగన్ ప్రకటించి కత్తులు దూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి
-కులాలను అభివృద్ధి చేయడమంటే కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు
-లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ వందల్లో కూడా ఇవ్వడంలేదు
-బూతులు తిట్టే మంత్రులు ఉన్న సమాజం ఎటువైపు పోతుంది
-అప్పు చేసి ఇచ్చే సంక్షేమ పథకాలు కావు …అభివృద్ధి చేసి ఇచ్చే పథకాలు కావాలి
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ జలవివాదం నమ్మశక్యంగా లేదని అన్నారు. తాము చాలా సఖ్యంగా ఉన్నామని ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ ప్రకటించారని… అలాంటప్పుడు వివాదాలు ఎందుకు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే అ వివాదం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని అన్నారు.
వెనుకబడిన కులాలను పైకి తీసుకురావడమంటే… కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదని పవన్ అన్నారు. అధికారం లేని కులాలను పైకి తెచ్చే విధంగా జనసేన పని చేస్తుందని చెప్పారు. బూతులు తిట్టే మంత్రులు ఉన్న సమాజం ఎటు వైపు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. అప్పు చేసి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అవసరం లేదని… అభివృద్ధి చేసి ఇచ్చే సంక్షేమ పథకాలు కావాలని అన్నారు.
లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు జగన్ చెప్పుకున్నారని… ఇప్పుడు కేవలం మూడు వేల ఉద్యోగాలను మాత్రమే ప్రకటించారని పవన్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. త్వరలోనే దీనిపై కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.