Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీఏ హయాంలో తెలుగు ప్రజలకు ప్రాధాన్యం :బీజేపీ తిరస్కారం …రేవంత్

యూపీఏ హయాంలో తెలుగు ప్రజలకు ప్రాధాన్యం :బీజేపీ తిరస్కారం …రేవంత్
-కేంద్ర కేబినెట్​ విస్తరణ తీరుపై రేవంత్​ విమర్శలు: వైయస్సార్ కు నివాళులు
-తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే అవకాశం ఇచ్చారన్న రేవంత్
-తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అవమానంగా భావించాలి
-10 మందికి యూపీఏ అవకాశం ఇచ్చిందని వ్యాఖ్య
-పంజాగుట్టలో వైయస్ కు నివాళి అర్పించిన రేవంత్
-భారతరత్న ఇవ్వాలన్న జీవన్ రెడ్డి!
-భారతరత్నకు అర్హత కలిగిన ఏకైక తెలుగు వ్యక్తి వైయస్ మాత్రమేనన్న జీవన్ రెడ్డి
-కాళేశ్వరం ప్రాజెక్టు వైయస్ హయాంలోనే ప్రారంభమయిందని వ్యాఖ్య

టీపీసీసీ పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలకు పదును పెంచారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో తెలుగు వారికి దక్కిన ప్రాతినిధ్యాన్ని, ఇప్పుడు ఎన్డీయే ఇచ్చిన ప్రాధాన్యాన్ని పోల్చారు.

పదేళ్ల యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది తెలుగు వారికి కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం ఒక్కరికే ఆ అవకాశం దక్కిందని విమర్శించారు. తమ సామర్థ్యాన్ని బీజేపీ అధినాయకత్వం విశ్వసించనందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అవమానంగా భావించాలని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాదులోని పంజాగుట్ట సెంటర్ వద్ద ఉన్న వైయస్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఘనతను వైయస్ ప్రపంచానికి చాటారని కొనియాడారు. భారతరత్నకు అర్హత కలిగిన ఏకైక తెలుగు వ్యక్తి వైయస్ మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైయస్ హయాంలోనే ప్రారంభమయిందని… ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు వైయస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టలేదని… ఆ ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. వైయస్సార్ తెలంగాణ పక్షపాతి అని అన్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ధ్వజం …

Ram Narayana

వివేకా హత్యపై …టీడీపీ నేత నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

సీఎం సీటుకే ఎసరు పెట్టిన హరీష్ రావు నీతులు మాట్లాడటమా ? ఈటల సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment