కొత్త ముసుగులో చంద్రబాబు తెలంగాణలోకి వస్తున్నారు: హరీశ్ రావు…
తన మనుషులను చంద్రబాబు కాంగ్రెస్ లోకి పంపించారు
ఆయన సన్నిహితుడు రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చారు
వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నారు
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయనపై టీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. రేవంత్ ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారని… అయితే చంద్రబాబుని ఆంధ్రబాబు అంటూ తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారని చెప్పారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే చంద్రబాబుని తెలంగాణ ప్రజలు రానివ్వరని… అందుకే తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి ముందు పంపి, ఇప్పుడు చంద్రబాబు అడుగుపెడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చారని హరీశ్ అన్నారు. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లేనని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పొలాల్లోకి నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పారు.