కృష్ణ జలాల విషయంలో ఇద్దరు సీఎం లు నాటకాలాడుతున్నారు:బండి సంజయ్ ఫైర్
-ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టి ఉద్రిక్తతలు పెంచుతున్నారు
-ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే!:
-కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ నాటకాలాడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించడం ద్వారా ఉద్రిక్తతలు పెంచుతున్నారని మండిపడ్డారు. నిన్న నాగర్‌కర్నూలులో పర్యటించిన బండి సంజయ్.. సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి కేంద్రం రూ. 1200 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సోమశిల వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన హామీ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ప్రజలు ప్రశ్నించడానికి ముందే కేసీఆర్ తానిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకుంటూ కూడా ప్రధానమంత్రి ఫొటో పెట్టడం లేదన్నారు. ఇలాంటి సంస్కారం లేని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.