Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ లో తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాద్ధాంతం….

ఏపీ లో తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాద్ధాంతం
అకాడెమీ పేరు మార్చితే తెలుగు భాషకు వచ్చిన నష్టమేంటి?: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చిన సర్కారు
విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
స్పందించిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వం తెలుగును తక్కువ చేస్తోంది: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి
సంస్కృతంపై ప్రేమ ఉంటే మరో అకాడమీ ఏర్పాటు చేసుకోండి
తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలి
పరభాష వ్యామోహంతో మాతృభాషను చంపేస్తున్నారు: ఎస్ఎఫ్ఐ ఏపీ అధ్యక్షుడు
తెలుగు అకాడెమీ పేరు మార్పుపై విద్యార్థి సంఘాల ఫైర్
తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
పేరెందుకు మార్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేతలు

తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలుగు అకాడెమీకి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావని, సంస్కృత భాషాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు వస్తాయని వెల్లడించారు. ఈ కోణంలో, పేరు మార్పు నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని యార్లగడ్డ స్పష్టం చేశారు. సీఎం జగన్ చొరవ చూపి మైసూరులో ఉన్న ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారని వెల్లడించారు. అసలు, తెలుగుకు ప్రాచీన హోదా లభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాల వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో తెలుగు అకాడెమీని నిర్లక్ష్యం చేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 3 నెలల్లోనే పరిస్థితులు చక్కదిద్దారని యార్లగడ్డ వివరించారు.

తెలుగు అకాడెమీని, అధికార భాషా సంఘాన్ని టీడీపీ పాలకులు పతనం దిశగా తీసుకెళ్లారని విమర్శించారు. అయినా, తెలుగు అకాడెమీ పేరును తెలుగు-సంస్కృత అకాడెమీ అని మార్చినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అంశంలో చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని యార్లగడ్డ పేర్కొన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ …..

తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు భాష స్థాయిని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇదే అంశంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తీయనైన తెలుగుకు తెగులు పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. తెలుగు అకాడమీ పేరును మార్చడం తగదని చెప్పారు. సంస్కృత భాషపై అంత ప్రేమ ఉంటే.. దానికి మరో అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. తెలుగును ఏపీ ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు.

పిల్లల చదువులోకి బలవంతంగా ఆంగ్ల భాషను చొప్పించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలని, మాతృ భాష అభివృద్ధి కోసం తగినన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఎస్ ఎఫ్ ఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ …..

ఏపీ తెలుగు అకాడెమీ పేరును మార్చడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి విద్యార్థి సంఘాలు వినతిపత్రాన్ని ఇచ్చి, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను నిర్వీర్యం చేయాలనే చూస్తున్నారని ప్రసన్నకుమార్ మండిపడ్డారు. పరభాషా వ్యామోహంతో మాతృభాషను మృతభాషగా చేయాలనుకోవడం దారుణమని అన్నారు. ఏపీలో తెలుగు మీడియంను పూర్తిగా తీసేయాలనే ప్రభుత్వ ఆలోచనను కోర్టులు కూడా తప్పు పట్టాయని చెప్పారు. తెలుగు అకాడెమీ పేరును మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని… లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

 

 

Related posts

మిడతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పిన కేసీఆర్!

Drukpadam

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిలు.. అర్ధరాత్రి దాటాక విడుదల!

Drukpadam

How To Update Your Skincare Routine For Autumn

Drukpadam

Leave a Comment