రైతు కంట కన్నీరు చిందిన రాజ్యం బాగుపడదు: సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ
రైతుల సమస్యలపై సర్కారును నిలదీసిన కోమటిరెడ్డి
రైతులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం
ఇప్పటికీ ధాన్యం బకాయిలు చెల్లించలేదని వెల్లడి
ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతు కంట కన్నీరు చిందిన రాజ్యం బాగుపడదని, ఇకనైనా రైతులను కడగండ్ల పాల్జేసే చర్యలకు స్వస్తి పలకాలని కోమటిరెడ్డి హితవు పలికారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను చిన్నచూపు చూడడం తగదని స్పష్టం చేశారు. రైతులపై కుటిల ప్రేమ చూపడం మానుకోవాలని పేర్కొన్నారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు రూ.600 కోట్లు చెల్లించాలని, లేదంటే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని కోమటిరెడ్డి తన లేఖలో డిమాండ్ చేశారు.
వర్షాల సీజన్ షురూ అయిందని, రైతులు నాట్లు వేయడం ప్రారంభించినా గానీ ధాన్యం బకాయిల బిల్లులు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నించారు. బకాయిలు అందక లక్షమంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఉరుకులు పరుగుల మీద నిధులు విడుదల చేసినప్పుడు, అదే విధంగా రైతుల బకాయిలు ఎందుకు విడుదల చేయడంలేదని కోమటిరెడ్డి నిలదీశారు.