తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు…
-న్యాయవ్యవస్థ ,ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల ఫోన్లు కూడా టాపింగ్
-ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
-వైర్ ఉదతంతంపై ప్రధాని మోడీ మౌనం వీడాలి
-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలి
పెగాసస్ స్పై వేర్‌తో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెట్టారన్న కథనాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్,ప్రముఖ జర్నలిస్టులు,కేంద్రమంత్రులు,సామాజిక కార్యకర్తల ఫోన్లను ఈ స్పైవేర్‌తో హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ స్పై వేర్ ఉదంతాన్ని నిరసిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీనిపై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పలువురు రాజకీయ నాయకుల ఫోన్లను,ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తుతున్నవారి ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. న్యాయ వ్యవస్థ,ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ విధానానికి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌ను నిరసిస్తూ ఈ నెల 22న ఇందిరాపార్క్ నుంచి ఛలో రాజ్‌భవన్ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో భావప్రకటనా స్వేచ్చ లేకుండా పోతోందని… పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై ప్రధాని మోదీ,కేంద్రమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తారని… రాహుల్ గాంధీ ఫోన్‌ను దాంతో ట్యాప్ చేశారని ఆరోపించారు. దేశంలోని రాజకీయ నాయకులు,జర్నలిస్టులు,సామాజిక కార్యకర్తల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు. బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని… 2019 సాధారణ ఎన్నికలకు ముందు నుంచే ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు టొరొంటో యూనివర్సిటీ రిపోర్ట్‌లో వెల్లడైందని చెప్పారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగితే అది ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకే ప్రమాదమని హెచ్చరించారు. స్పై వేర్ ఉదంతంపై ప్రధాని మోదీ ఇకనైనా మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.