సీఎంగా యెడియూరప్ప సమర్థంగా పనిచేస్తున్నారు: జేపీ నడ్డా!
-కర్ణాటకలో దళిత సీఎం అంటూ వార్తలు
-అనిశ్చితిలో సీఎం యెడియూరప్ప
-స్పష్టత ఇచ్చిన జేపీ నడ్డా
-యెడ్డి సర్కారుపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడి
కర్ణాటక లో ముఖ్యమంత్రి మార్పు పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గోవా పర్యటనలో ఉన్న నడ్డా మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక సీఎం యెడియూరప్ప పనితీరుపై ప్రసంశలు కురిపించారు. రేపు జరగనున్న శాసనసభ పక్ష సమావేశంలో కర్ణాటక సీఎం మార్పు ఉంటుందంటూ ప్రచారం జరిగింది . దళితున్ని సీఎం చేయబోతున్నారంటూ మీడియా కోడైకూసింది. కానీ నడ్డా ప్రకటన తో సీఎం మార్పు జరుగుతుందా ? లేదా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తోపాటు హోమ్ మంత్రి అమిత్ షా ,నడ్డా లను కలిసిన సీఎం యాదియిరప్ప సైతం కేంద్ర నాయకత్వానికి తన పనితీరు పట్ల సంతృప్తి ఉందని అన్నారు. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని చెప్పటంతో ఇక యడ్డి శకం ముగిసిందని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో సహా అందరు అనుకున్నారు. యెడ్డిని ఇక సర్దుకోమని చెప్పి ఉంటారని అందుకే ఆయన జులై 26 తన పని విధానంలో మార్పు ఉంటుందని చెప్పటం దానికి బలాన్ని చేకూర్చింది.
కర్ణాటకలో దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాను సీఎం పదవిలో కొనసాగడంపై యెడియూరప్ప అనిశ్చితితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సాయంత్రంలోగా కర్ణాటక సీఎంపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని జాతీయ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోవా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎంగా యెడియూరప్ప సమర్థంగానే పనిచేస్తున్నారని, ప్రభుత్వ పనితీరు పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని యెడియూరప్ప తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారని కితాబిచ్చారు. కర్ణాటక సర్కారులో నాయకత్వ సంక్షోభం ఉన్నట్టు మీడియాకు అనిపిస్తోందని, తమకు అలా కనిపించడంలేదని జేపీ నడ్డా పేర్కొన్నారు.